Welcome to swarasaagaram.blogspot.com: dharma sandehalu, vedic culture devotional questions & answers, bhakti samacharam, telugu devotional doubts, sandehalu, samadhanalu:
లక్ష్మీదేవి కమలంలో ప్రక్కనే ఏనుగులు ఎందుకు ఉంటాయి?
శ్లో. పద్మాసనే పద్మహస్తే సర్వలోకైక వందితే
నారాయణ ప్రియేదేవి విష్ణువక్షస్థలాలయే
క్షీరసాగర సంభూతే కమలే కమలప్రియే
పాహిమాం కృపయాదేవీ సర్వసంపత్ప్రదాయనీ!!
(లక్ష్మీదేవికి రెండువైపులా ఏనుగులు ఎందుకుంటాయంటే, గజ బలం ఎంత గొప్పదో ధనబలం కూడా అంత గొప్పదని మనం తెలుసుకోవటానికి. ఒక్కరోజుకి వాడిపోయే కలువ పూవులో లక్ష్మీదేవి దర్శనమిచ్చే కారణం. ‘‘ధనం శాశ్వతం కాదు. ఏదో ఒకరోజు మాయమైపోతుంది. అని అందరికీ తెలియచెప్పటానికే! నీటి అలలకూ, చిన్న గాలికీ, ఊగిపోయే కలువకు అర్థమేమంటే ధనం నిలకడగా ఉండదు అని.)
దేవదానవులు క్షీరసాగరాన్ని మధించినపుడు జన్మించి విష్ణువును వరించిందామె! సర్వ లక్షణ సంపన్నురాలైన ఈసుందరవతికి ‘‘లక్ష్మీ’’ అని నామకరణం చేశారు. సమస్త సంపదలకు అధిదేవతగా చేశారు! దేవతలందరూ! లక్ష్మీదేవి చిత్రపటాన్ని చూచారు గదా!
పాలనురుగు లాంటి దేహఛాయ, త్రిలోకైక సౌందర్య, ఈమెకు స్వంతం! చిరునవ్వు నిండిన ముఖంతో, సర్వాలంకార భూషితయై, గజరాజులు తోడుగా నాలుగు చేతులతో, కమలాసనంపై కూర్చొని ఉంటుంది. చేతులలో ఏ ఆయుధాలు వుండవు. కలువపూలను మాత్రమే చేత ధరించి వుంటుంది! ఈ ధనాధిదేవత!
దేవతలకు నాలుగు చేతులు ఎనిమిది చేతులు వుండటం మనం శిల్పాలలో ఫొటోలలో చూస్తుంటాం. అంటే అంతటి శక్తి వుంది అని అర్థం! లక్ష్మీకి సరస్వతికి నాలుగు చేతులు వుంటే పార్వతి (శక్తి)కి ఎనిమిది చేతులు వుంటాయి. డబ్బు కన్నా, విద్య కన్నా, భుజబలం చాలా గొప్పదని అర్థం.
ధనలక్ష్మికి స్థిరత్వం లేదు. ఒకరి దగ్గర ఒకచోట స్థిరంగా ఉండదు. లక్ష్మి చంచల మనస్సు గలది. స్థిరమైన జీవితం కూడా లేదు. అయితే వున్న నాలుగు రోజులు ఉయ్యాల లూగిస్తుంది. అందరినీ అన్నిటినీ దాసోహమనిపిస్తుంది. తన శక్తి ఏమిటో ఎంతటిదో చూపిస్తుంది. అందుకే డబ్బుకు లోకం దాసోహం అంటారు. ‘‘ధనం మూల మిదం జగత్’’ అంటారు. లక్ష్మికి నాలుగు చేతులుండే కారణం యిదే!
తన చంచలత్వాన్ని అందరికీ తెలియపర్చటానికే శ్రీమహాలక్ష్మీ నీటి కొలనులో వున్న తామరలో కూర్చొని వుంటుంది. నీటిలో వున్న కలువపూవు నిశ్చలంగా ఉండదు. చిన్న గాలికే అటూ ఇటూ ఊగిసలాడుతుంది. కలువపూవు నీటిలో వున్నంతసేపే నిగనిగలాడుతుంది. నీటి నుండి బయటకు తీయగానే వాడిపోతుంది. డబ్బు కూడా పెట్టెలో భద్రంగా వుంటేనే మనిషికి శక్తి వుంటుంది. బయటకు తీసి ఖర్చు పెట్టేస్తే మనిషికి శక్తి సన్నగిల్లుతుంది. అన్ని విధాలుగా మనిషి కృంగిపోతాడు.