ఇట్టి ముద్దులాడి బాలు..అన్నమాచార్య కీర్తన
పల్లవి: ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాని |
పట్టి తెచ్చి పొట్టనిండ పాలువోయరే ||
||ఇట్టి||
చరణం 1: గామిడై పారితెంచి కాగెడి వెన్నలలోన |
చేమపూవు కడియాల చేయిపెట్టి ||
చీమ కుట్టెనని తన చెక్కిట కన్నీరు జార |
వేమరువాపోవు వాని వెడ్డు వెట్టరే ||
||ఇట్టి||
చరణం 2: ముచ్చువలెవచ్చి తన ముంగమురువుల చేయి |
తచ్చెడి పెరుగులోన తగబెట్టి ||
నొచ్చెనని చేయిదీసి నోరునెల్లజొల్లుగార |
వొచ్చెలి వాపోవువాని నూరడించడరే ||
||ఇట్టి||
చరణం 3: ఎప్పుడు వచ్చెనో మాయిల్లుచొచ్చి పెట్టెలోని |
చెప్పరాని వుంగరాల చేయిపెట్టి ||
అప్పడైన వేంకటాద్రి అసవాలకుడు గాన |
తప్పకుండ పెట్టె వాని తలకెత్తరే ||
||ఇట్టి||